Friday, February 19, 2010

స్నేహమంటే ఇదేనేమో..!!

పేరు చూడగానే మీకు అర్థం అయ్యే ఉంటుంది ఇదేదో స్నేహం గురించి అని...అవును మీరు అనుకున్నది కర్రెక్టే.ఏదో నాకు తోచినట్టుగా,వచ్చినట్టుగా ఈ కథ రాస్తున్నాను..:)

"పిల్లలు ఈ రోజు మన క్లాస్ లో సుచిత్ర అనే అమ్మాయి చేరబోతోంది." చెప్పింది టీచరు."రామ్మా సుచిత్ర,నిన్ను క్లాస్ కి పరిచయం చేసుకో".
సుచిత్ర పన్నెండేళ్ళ అమ్మాయి,బంగారు మేని ఛాయతో,నల్లటి ఒతైన జుట్టుతో అమ్మాయిల మొదటి బెంచిలో చివరన కూర్చొని ఉంది.మెల్లగ తన బెంచి నుంచి లేచింది.క్లాస్ లో మేమంతా ఆమెనే చూస్తున్నాము.మా వింత చూపుల మధ్య,కొత్త మొహాల మధ్య,కొత్త ఊరిలో తను బాగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది.టీచరు ఉన్న వైపుకు మెల్లగ నడుస్తూ వెళ్ళి తల వంచుకొని నిలబడింది,ఏదో పనిష్మెంట్ లాగా.
"సుచిత్ర, క్లాస్ కి పరిచయం చేసుకో.ఎందుకలా తల వంచుకొని నిలబడ్డావు? టైం వేస్ట్ చెయ్యకు" కొంచం కటువుగా అంది టీచరు.
"నా పేరు సుచిత్ర" అంది సుచిత్ర వణుకుతున్న స్వరంతో...
క్లాసంత గుసగుసలు మొదలయ్యాయి.టీచరు సుచిత్రని తన బెంచికి వెళ్ళమని, పాఠం మొదలు పెట్టారు.సుచిత్రకి దాదాపు కళ్ళ నీళ్ళు తిరిగాయి.క్లాసు జరుగుతున్నంత సేపు తను పరధ్యానంగా ఉండటం నేను గమనించాను.
లంచ్ బ్రేక్ లో సుచిత్ర తన బెంచిలో ఒంటరిగా కూర్చొని ఏదో పుస్తకం చూస్తూ ఉంది.దృష్టి పుస్తకం మీద ఉన్నా తన ఆలోచనలన్నీ వాళ్ళ ఊరి గురించే."హాయ్" అన్న పిలుపుతో తను తల ఎత్తి పక్కనే నవ్వుతూ నిలబడి ఉన్న నన్ను చూసింది.
"నా పేరు కవిత.నేనూ ఈ క్లాస్ లోనే చదువుతున్నాను.అవును నువ్వు ఎందుకు భోజనం చెయ్యటం లేదు?"
"నాకు పెద్దగా ఆకలి వేయటం లేదు" చెప్పింది సుచిత్ర.
"ఎందుకు లేదు.నాకు తెలుసు అందరూ నిన్ను చూసి నవ్వినప్పుడు నువ్వు బాధపడ్డావని.నాకు కూడా అది నచ్చలేదు,వాళ్ళ గురించి పట్టించుకోకు.నువ్వు లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా?"
"తెచ్చుకున్నాను.నువ్వు నాతో కలిసి తింటావా?" అంది సుచిత్ర చిన్నగా నవ్వుతూ.
"తింటాను,పద అలా బయట కూర్చొని తిందాము" అని ఇద్దరం బయట ప్లే గ్రౌండ్లో చెట్టు కింద భోజనం చేసాము.ఇద్దరం,మా భోజనాన్ని పంచుకున్నాము కూడా.
"నీకు మీ ఊరు,పాత స్కూలు గుర్తుకొస్తున్నాయి కదా?"
"అవును చాలా.ఇంతకు ముందు మేము తాడిపత్రిలో ఉండే వాళ్ళాము.నాన్నకి ఇక్కడికి ట్రాన్స్ఫెర్ అయ్యింది.నా 6th క్లాస్ మార్కులు తక్కువ ఉండటం వలన ఈ స్కూల్ లో సీటు రాలేదు. అప్పుడు నాన్న డొనేషన్ కట్టి ఇందులో చేర్పించారు.నేను ఖచ్చితంగ ఫెయిల్ అవుతాను" అంది సుచిత్ర బాధతో.
"అలా బాధపడకు సుచిత్ర,నేను నీకు సహాయం చేస్తానులే.నువ్వు అన్నీ త్వరగానే నేర్చుకుంటావు.అవును,ఇంతకి మీ ఇల్లు ఎక్కడ?"
"సాయి నగర్ 5th క్రాస్" అంది సుచిత్ర.
"నేను ఉండేది అక్కడే"
"అవునా" అంది సుచిత్ర సంతోషంగా.
"అవును.ఇక అసలు బాధపడకు.ఇద్దరం కలిసి చదువుకుందాము."
"నిన్ను సుచి అని పిలవనా?"
"తప్పకుండా.అలా పిలిస్తేనే నాకు బాగుంటుంది.మా పాత స్కూల్లో అందరూ నన్ను అలానే పిలిచే వాళ్ళు" అంది సుచి కళ్ళతో నవ్వుతూ.
అలా ఆరవ తరగతిలో మొదలైన మా స్నేహం చాలా సంవత్సరాల వరకు కొనసాగుతుందని నేను అనుకోలేదు......
సుచి చాలా తెలివైనది.అన్నీ చాలా త్వరగా గ్రహించేది.మేమిద్దరము చాలా కొద్ది కాలంలోనే మంచి స్నేహితులమయ్యాం.మా వలన,మా కుటుంబాల మధ్య కూడా స్నేహం ఏర్పడింది.సుచి ఆరవ తరగతి మామూలు మార్కులతోనే పాస్ అయ్యింది.సుచిని చదువే కాకుండా మిగత కార్యక్రమాల్లో నాతో పాటు పాల్గొనమనేదాన్ని.దీనితో తన ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది.అన్నికార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది.మా స్నేహం ఎంతగా బలపడింది అంటే,మా క్లాస్ అంతా మమ్మల్ని చూసి అసూయ పడేంత.ఇద్దరం ఎంతో సంతోషంగా ఆడుతూ,పాడుతూ మా స్కూలు చదువులు ముగించాము.
ఇంటర్మీడియట్ లోనూ మంచి మార్కులతో పాస్ అయ్యి,కాంపిటిటీవ్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి ,RV ఇంజనీరింగ్ కాలేజి,బెంగుళూరు లో సీటు సంపాదించాము.ఇద్దరం చాలా ఉత్సాహంగా,సంతోషంగా కాలేజి లైఫ్ లో అడుగు పెట్టటానికి రెడీ అయిపోయాము.కానీ అక్కడ అనుకోని సంఘటనలు జరుగుతాయని,మా స్నేహానికి ఎన్నో అవరోధాలు వస్తాయని నేను ఊహించలేక పొయాను....
(ఇంకా ఉంది)...

2 comments:

  1. కథ బాగుంది...మిగతా భాగాలు త్వరగా రాయండి..:)

    ReplyDelete
  2. ఒహ్ కధ మొదలు పెట్టారా..వ్రాయండి వ్రాయండి ... శైలి బాగుంది ..:)

    ReplyDelete